TELANGANA

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రగతి : గవర్నర్ తమిళి సై

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ ముందుకు పోతోందని.. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం పురోగమిస్తోందని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ పురోగమిస్తోందని, అనేక అపూర్వ విజయాలు సాధించిందని గవర్నర్ వెల్లడించారు. ఒకప్పుడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రాంతం.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం చేసిన కృషితో 24 గంటల విద్యుత్ సరఫరా చేసుకుంటూ వెలుగు జిలుగులుగా మారిపోయిందని చెప్పారు. గతంలో వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేలగా ఉండగా.. ఇవ్వాళ దేశానికే (India) అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని వివరించారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి

.. 100 శాతం గ్రామాల్లో ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో గ్రామాలు పాడుబడినట్టుగా ఉండేవని.. కానీ నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటిగా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకొని పోతోందని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ తెలంగాణ అందరి ప్రశంసలు అందుకుంటున్నదని అన్నారు. 2014-15లో రూ.62వేల కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం.. 2021 నాటికి కేసీఆర్ ప్రభుత్వ కృషి వల్ల రూ.1.84 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరుకుందని గవర్నర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్ని రంగాల్లో రెట్టింపు అభివృద్ధి జరిగిందని.. అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికం చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ (Governor Tamilisai) వెల్లడించారు.