National

టీడీపీని వదలని 70+ బొమ్మాళి! జనసేనాని చెప్పిందే..!!

`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) 2024 నాటికి కనుమరుగవుతుంది. అప్పుడు జనసేన బలపడుతుంది..` అంటూ ఒకానొక సందర్భంలో ఆ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ఆనాడు(1983) ఎన్టీఆర్ తరహాలో జనసేన(Janasena)కు కొత్తతరం నాయకత్వం వస్తుంది. ఫలితంగా రాజ్యాధికారాన్ని అందుకోగలమని అప్పట్లో పవన్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ కనిపిస్తోంది. 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న లీడర్లు పక్కకు తప్పుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీ అంతటా కనిపిస్తున్నారు. దానికితోడు ఇతర పార్టీలకు వెళ్లిన సీనియర్లు(కురువృద్ధులు) చంద్రబాబు వైపు ఇప్పుడు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు తదితరులు అందరూ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని గ్రహించిన వెటరన్ లీడర్లు(TDP-1983) పార్టీలకు అతీతంగా చంద్రబాబు వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి(70+) టీడీపీ నుంచి రాబోవు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వైసీపీలోని 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీనియర్లందరూ దాదాపుగా సైకిల్ ఎక్కడానికి మంతనాలు సాగిస్తున్నారు. వాళ్లను పంపేయడానికి వైసీపీ ఇప్పటికే రంగం సిద్దం చేసింది. యనమల కుమార్తె దివ్యను ఎన్నికల రంగంలోకి దించడానికి.. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు(TDP-1983) వాళ్ల కుటుంబీకులను వారసత్వంగా దించేశారు. తాజాగా మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గాన్ని ఆక్రమించేశారు. వరుసగా ఓడిపోతూ వస్తోన్న ఆయన గత రెండు ఎన్నికల్లో సోదరుడ్ని నిలబెట్టినప్పటికీ ప్రజలు తిరస్కరించారు. ఈసారి యనమల కుమార్తె దివ్యను ఎన్నికల రంగంలోకి దించడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు చంద్రబాబునాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇప్పటికే యనమల కుటుంబం అంటేనే మండిపడుతోన్న తుని నియోజకవర్గం ఓటర్ల మనోభావాలను టీడీపీ అధిష్టానం గుర్తించడంలేదని పార్టీలోని అంతర్గత వర్గాల అభిప్రాయం.