National

దిద్దుబాటు చర్యల్లో ప్రధాని మోడీ.. న్యాయ శాఖ సహాయ మంత్రి కూడా ఔట్

సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయశాఖకు మధ్య చెలరేగిన వివాదం ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు చెడ్డ పేరునే ఆపాదించిందని చెప్పొచ్చు. జడ్జీల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు కూడా చోటు కల్పించాల్సిందేనంటూ కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు పదేపదే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పైగా, సుప్రీంకోర్టును శాసించేందుకు ప్రధాని మోడీ సర్కారు ప్రయత్నిస్తుందనే విమర్శలు సైతం వచ్చాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ లేదా కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఎక్కడా చెలించలేదు. కానీ, తాజాగా కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

అదేసమయంలో కేంద్ర మంత్రివర్గంలో దిద్దుబాటు చర్యలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. కేంద్ర న్యాయశాఖామంత్రిగా కిరణ్ రిజిజును తొలగించిన కొన్ని గంటల్లోనే ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్ బఘేలాను కూడా తప్పించారు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రిని కేటాయించారు. కాగా, కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. న్యాయ శాఖను అర్జున్ రామ్ మేఘావాల్‌కు ప్రధానమంత్రి అదనంగా అప్పగించారు.