National

కొత్త మేయర్లకు యోగీ ఆదిత్యనాథ్ కీలక సూచన- ఇక మీ కాళ్లపై మీరే…

తాజాగా జరిగిన యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం 17 కార్పోరేషన్లను కాషాయ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆరుగురు మేయర్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపిన సీఎం యోగీ.. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇందులో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పోరేషన్లను స్వశక్తిపై నిలిచేలా చేయాలన సూచించారు.

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసిన వారిలో మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్, వారణాసి మేయర్ అశోక్ తివారీ, కాన్పూర్ మేయర్ ప్రమీలా తివారీ, బరేలీ మేయర్ ఉమేష్ గౌతమ్, ఫిరోజాబాద్ మేయర్ కామినీ రాథోడ్, షహరాన్ పూర్ మేయర్ డాక్టర్ అజయ్ కుమార్ సింగ్ ఉన్నారు. ఈ సందర్బంగా ఆయా మేయర్లను వారి కార్పోరేషన్లకు ఉన్న మంచి పేరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఆదాయాలు పెంచుకోవాలని సూచించారు.

కొత్త మేయర్లంతా తమ కార్పోరేషన్ల పరిధిలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలని, అలాగే మంచి పనులకు ప్రాధాన్యమివ్వాలని యోగీ ఆదిత్యనాథ్ వారికి సూచించారు. స్ధానిక సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని కూడా ఆదేశించారు. ప్రత్యేకంగా భూగర్బ కేబులింగ్, ఘనవ్యర్ధాల నిర్వహణ వంటి అంశాల్లో మేయరు సమర్దంగా పనిచేయాలని యోగీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే పట్టణ ప్రాంతాల్ల వీధి కుక్కల సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు.

ప్రతీ కార్పోరేషన్ కూడా అదనపు ఆదాయం ఎలా సంపాదించాలన్న దానిపై దృష్టిసారించాలని యోగీ ఆదిత్యనాధ్ సూచించారు. మున్సిపల్ పన్నుల పెంపుతో పాటు ప్రతీ అంశంలోనూ ఆదాయం సాధించే మార్గాలపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించేందుకు అవసరమైన అన్ని మార్గాల్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం యోగీ పేర్కొన్నారు.

తద్వారా ఆదాయం పెంచుకోవాలన్నారు.