మెగా ఫ్యామిలీ అండ దండలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అయితే భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనదైన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. మెగా ఇమేజెస్ తో సంబంధం లేకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. `పుష్ప`(Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి.. నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అయితే ఈ జాబితాలో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏంటా అని ఆలోచిస్తున్నారా.. డార్లింగ్. అవును, మీరు విన్నది నిజమే. తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఎ.కరుణాకరన్, ప్రభాస్ కాంబినేసన్ లో రూపుదిద్దుకున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా `డార్లింగ్`.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభు, శ్రద్ధా దాస్, ముకేష్ రిషి, ఎమ్.ఎస్.నారాయణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికే అర డజన్ ఫ్లాపులతో సతమతం అవుతున్న ప్రభాస్ మళ్లీ డార్లింగ్ మూవీతోనే ఫామ్లోకి వచ్చింది. ఇందులో ప్రభాస్(Prabhas), కాజల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
అయితే వాస్తవానికి డైరెక్టర్ కరుణాకరన్ డార్లింగ్ సినిమాను అల్లు అర్జున్ తో చెయ్యాలనుకున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడట. కానీ, అప్పటికే కరుణాకరన్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన `హ్యాపీ` మూవీ ఫ్లాప్ అయింది. దాంతో డార్లింగ్ కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీగా లేవు అన్న పనికిమాలిన కారణంతో రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్(Darling) ను ఓకే చేయడం, హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి.