CINEMANational

ఒడిశా రైలు ప్రమాదం: చిరంజీవి దిగ్భ్రాంతి

ఎవరూ ఊహించని ఘోర రైలు ప్రమాదం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న రాత్రి ఒడిశాలో క్షణాల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు రైళ్ళు ఢీకొన్న ఘటన దేశాన్ని షాక్ కి గురి చేసింది.

ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలైనట్టు పేర్కొన్నారు. గాయపడినవారిని వివిధ ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం బహనాగా స్టేషన్ దాటిన కొద్దిసేపటికే పొరపాటున లూప్ లైన్ లోకి ప్రవేశించింది. సిగ్నలింగ్ లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రాథమిక నివేదికలో మానవ తప్పిదం వల్లే ఇది జరిగినట్లు తేలిందన్నారు.

ఇదిలా ఉంటే ఒడిశా ప్రమాద ఘటనపై సినీ రంగ ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒడిశాలో విషాదకరమైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిందని పేర్కొన్న చిరంజీవి భారీ ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంతో అవసరంగా మారిందని, క్షతగాత్రులకు రక్త యూనిట్ల కోసం అవసరం ఉందని తాను అర్థం చేసుకున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ప్రాణాలను రక్షించే రక్త యూనిట్లను దానం చేయడం కోసం సాధ్యమైన సహాయాన్ని అందించమని మా అభిమానులందరికీ, మరియు సమీప ప్రాంతాల్లోని మంచి స్వచ్ఛంద సేవకులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నటి రష్మిక మందన స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్మిక మందన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతోంది అని, మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు. గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశారు.