భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమబెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.
కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రెస్క్యూ సిబ్బందితో మాట్లాడారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్- ప్రమాద వివరాలన్నింటినీ మోదీకి వివరించారు. సంఘటన స్థలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ప్రధాని- రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రమాద వివరాలను వారు ఆయనకు తెలిపారు.