దిల్ సినిమా హీరోగా మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారా? గతంలో రాజకీయాల్లో ఉన్న ఆయన సమీప బంధువులు రాజకీయాల్లోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన నితిన్ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా?
సాక్షాత్తు అమిత్ షా తో భేటీ అయిన నితిన్ అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకుంటే, అప్పుడు లేదని చెప్పి ప్రస్తుతం పాలిటిక్స్ పై దృష్టి పెట్టారా?
నితిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ స్థానం టిక్కెట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు రా రమ్మని పిలిచిన పార్టీని సున్నితంగా తిరస్కరించిన నితిన్ నేడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమం లోనే ఆయన త్వరలో టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కలవాలి అనుకున్నట్టుగా తెలుస్తుంది.
అయితే నితిన్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను అంటే అగ్ర నాయకులే ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతారు. కానీ నితిన్ కాంగ్రెస్ పార్టీలో ఓ టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నితిన్ లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలంలో నితిన్ కుటుంబం, బంధువులు ఉంటారు. వీరిలో కొందరు సినిమాల నిర్మాణంలో ఉండగా కొందరు రాజకీయ రంగ ప్రముఖులు గా ఉన్నారు.
ప్రస్తుతం పిసిసి కార్యదర్శిగా పనిచేస్తున్న నితిన్ మేనమామ నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. నగేష్ రెడ్డి గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ కి పది సంవత్సరాలపాటు చైర్మన్ గా పనిచేశారు. గతంలో డీఎస్ మనిషిగా ఉన్న నగేష్ రెడ్డి డిఎస్ పార్టీ మారినప్పటికీ తాను మాత్రం పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వద్ద నితిన్ లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ టికెట్ ను జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి, భూపతిరెడ్డి లాంటి నాయకులు ఆశిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తో నగేష్ రెడ్డి భేటీ అయినప్పుడు టికెట్ విషయంలో సర్వేల ఆధారంగానే టికెట్లు నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నితిన్ ద్వారా టికెట్ కోసం నగేష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతుంది. దీంతో నితిన్ పొలిటికల్ ఎంట్రీ కూడా జరగబోతుంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే నితిన్ తన బంధువులకు టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారే తప్పా, రాజకీయాలలోకి ప్రస్తుతం రారని ఆయన అనుచరులు కొందరు చెబుతున్నారు.