NationalWorld

ఆ వాంతి ఖరీదు మూడు కోట్లు; ఎందుకు?

సహజంగా వాంతి అంటే అందరూ ముఖం అదోలా పెట్టుకుంటారు. మనుషులేనా, జంతువులైనా వాంతి చేసుకుంటే ఆ పరిసరాల్లో లేకుండా పారిపోతారు. కానీ తిమింగలాల వాంతి మాత్రం బంగారం కంటే విలువైనవిగా చూస్తారు.

స్పెయిన్ లోని లాపాల్ మాలోని నొగాలస్ బీచ్ లోకి ఒక స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరం కొట్టుకు వచ్చింది. ఇక దీనిపై పరిశోధన జరిపిన సైంటిస్టులు అందులో తిమింగలం వాంతి ఉన్నట్టు గుర్తించారు. సముద్రంలో తేలే బంగారం బాగా పిలిచే తిమింగలం వాంతి అది. ఈ వాంతి చాలా కాస్ట్లీ, ఇది నిధితో సమానం .

అసలు తిమింగలం ఎందుకు చనిపోయింది అనేది తెలుసుకోవడం కోసం లాస్ పాల్మస్ యూనివర్సిటీ, జంతు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో తిమింగలం కళేబరానికి అటాప్సీ నిర్వహించారు. ఈ సమయంలో తిమింగలం పొట్టలో వారికి 9.5 కిలోల బరువున్న తిమింగలం వాంతి కనిపించింది. ఇది చాలా అరుదైన నిధి అని గుర్తించిన వారు దానిని వెలికి తీశారు. ప్రస్తుతం తిమింగలం వాంతి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.

అసలు తిమింగలం వాంతి ఎందుకింత కాస్ట్లీ అంటే పురాతన కాలం నుండి, తిమింగలం వాంతిని సువాసనలు మరియు అత్యాధునిక పరిమళ ద్రవ్యాల తయారీలోనూ, అలాగే వివిధ సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. సహజంగా తిమింగలాలు సముద్రంలో వాంతి చేసుకున్నప్పుడు, ఈ విసర్జన సముద్రంలో నీటిపై తేలియాడుతూ కనిపిస్తుంది.

సముద్రంలో ఈ విసర్జనను ” ఫ్లోటింగ్ గోల్డ్”గా సూచిస్తారు. ఈజిప్షియన్లు దీనిని ధూపం వలె ఉపయోగిస్తారు. చైనీయులు దీని డ్రాగన్ స్పిటిల్ సెంట్ గా వ్యవహరిస్తుంటారు. దీనిని సౌందర్య సాధనాలను తయారు చేయడంలోనూ, మందులలోనూ ఉపయోగించడం వల్ల తిమింగలం వాంతికి ఇంతటి డిమాండ్ ఉంది. చాలా చోట్ల ఈ అరుదైన తిమింగలం వాంతి స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు.