చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా(Jack Ma) అనూహ్యంగా పాకిస్థాన్ లో పర్యటించారు. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు చేరుకున్నారని, దాదాపు ఒకరోజు అక్కడే ఉన్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికలు ధృవీకరించాయి.
తన పర్యటనలో, జాక్ మా.. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులకు దూరంగా ఉన్నారు. అతను ఒక ప్రైవేట్ ప్రదేశంలో బస చేశారు. జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని VP-CMA పేరుతో రిజిస్టర్ చేయబడిన ప్రైవేట్ జెట్ ద్వారా జూన్ 30న వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
చైనీస్ బిలియనీర్‌తో పాటు ఐదుగురు చైనా వ్యాపారులు, ఒక డానిష్, ఒక US వ్యాపారుడితో మొత్తంఏడుగురు వ్యాపారవేత్తల ప్రతినిధి బృందం కూడా ఉంది. వారు హాంకాంగ్‌లోని వ్యాపార విమానయాన రంగం నుంచి చార్టర్డ్ విమానంలో నేపాల్ చేరుకున్నారు. అక్కడి నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నట్లు తెలిసింది. జాక్ మా దాదాపు 23 గంటల పాటు పాక్ లో ఉన్నట్లు సమాచారం. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సాన్ ఈ పర్యటనను ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
జాక్ మా పాకిస్థాన్ పర్యటన కచ్చితంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని ఓ ట్వీట్‌లో అహ్సాన్ స్పష్టం చేశారు. జాక్ మా పర్యటన గురించి చైనా రాయబార కార్యాలయానికి కూడా తెలియదని ఆయన అన్నారు. “ఇది వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఇది పర్యాటక దృక్కోణం నుంచి పాకిస్తాన్ ఖ్యాతిని పెంపొందించడానికి సహాయపడింది” అని జోహైబ్ ఖాన్ చైర్మన్ P@SHA అన్నారు. పాకిస్థాన్ ఐటీ రంగానికి సంబంధించి జాక్ మా నుంచి ఒక ప్రకటన కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు.