‘రే మావ అలారం పెట్టరా లేదంటే మిస్సైపోతాం’, ‘నాకు నిద్ర రావట్లేదు మావ టెన్షన్ గా ఉంది ఎలా ఉంటుందోనని’, ‘రిలీజ్ అయ్యే వరకు లేచి ఉండాల్సిందే పడుకునేది లే’, ‘పగలు ఖాళీలేనట్టుగా ఈ అర్థరాత్రి రిలీజ్ గోలేందిరా బాబు’, ‘నా వల్ల కావట్లేదుగా ఆగలేకపోతున్నా’..
ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా.. ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్తగా ఓ ట్రెండ్ షురూ అవుతోంది. అదే అందరూ నిద్రపోయే సమయంలో అప్డేట్స్ రిలీజ్ చేయడం. దాని గురించే ఈ కథనం..
ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పదం… ట్రెండ్, అలాగే సెంటిమెంట్. కథలు, పాత్రలు, నటన, హావభావాలు, డ్యాన్సులు, యాక్షన్ ఫైట్లు, సాంకేతికం… ఇలా ఓ చిత్రానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ట్రెండ్ అనేది కొనసాగుతుంటుంది. అలాగే వాటిని చిత్రీకరించడానికి, రిలీజ్ చేయడానికి సెంటిమెంట్ అనేది ఫాలో అవుతుంటారు. అయితే మొత్తంగా ఓ చిత్రంపై ఆడియెన్స్ కు ఇంట్రెస్ట్ రావాలంటే.. సినిమానే కాదు.. సినిమా ప్రచారమూ కొత్తగా, వినూత్నంగా ఉండాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ మంత్రమే జపిస్తున్నారు.
అందుకే ఇప్పుడా ఆ ప్రచార చిత్రాల విషయంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మూలాను ఫాలో అవుతుంటారు మన దర్శకనిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఓ కొత్త ట్రెండ్ ను షురూ చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి అందులో ఏమైనా సెంటిమెంట్ ఉందా లేదా అనేది స్పష్టత లేదు. ప్రచార చిత్రాలు రిలీజ్ టైమ్ విషయంలో ప్రభాస్ సినిమాల నుంచి ఈ ట్రెండ్ కనిపిస్తోంది.
ప్రభాస్ సినిమాలతో షురూ.. :ప్రభాస్ గత రెండు, మూడు సినిమాల అప్డేట్స్ ను చూస్తుంటే ఇది అర్థమవుతుంది. అప్పట్లో ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్, టీజర్, చిత్ర విడుదల తేదీవి లాంటివి చూస్తే ఉదయం 8:28, 8:45, 10:06 గంటలకు ముహూర్తం పెట్టారు. పదింటికి అంటే ఓకే కానీ పొద్దునే ఎనిమిదింటికి అంటే.. అప్పుడంతా రెడీ అయ్యే హడావుడిలో ఉంటారు. అంటే రిలీజ్ కాగానే చూడటం కాస్త కష్టం. కాస్త ఫ్రీ అయ్యాక చూడాల్సి వస్తుంది.
సరే దీన్ని పక్కనపెడితే.. :ఆ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా అప్డేట్స్ ను ఉదయం 7 గంటల సమయంలో ఇచ్చారు. ఆ సమయంలో చాలా మంది నిద్రలోనే ఉంటారు. ఇక రీసెంట్ గా రిలీజైన ‘సలార్’ టీజర్ అయితే ఏకంగా మరీ తెలవారుఝామున 5:12 గంటలకు రిలీజ్ చేశారు. అప్పుడు ఫుల్ నిద్రలో ఉంటారు ప్రతిఒక్కరూ. ఇదంతా చూస్తుంటే ఏమైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా అనే సందేహం కలుగుతోంది. కానీ తప్పదు కాబట్టి ఫ్యాన్స్ మాత్రం అలారం పెట్టుకోని మరీ లేచి ఆ సమయాలకు రిలీజైన ప్రచార చిత్రాల్ని చూస్తున్నారు..
ఇకపోతే తాజాగా రిలీజైన ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ గ్లింప్స్ అయితే అర్థరాత్రి 2 గంటలకు రిలీజ్ చేశారు. వాస్తవానికి అమెరికా టైమ్ ప్రకారం దాన్ని విడుదల చేశారు. ఎందుకంటే ఆ ప్రచార చిత్రాన్ని ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ ఈవెంట్ లో ఆవిష్కరించారు. అందుకే మనకి అర్ధరాత్రి అయింది. ఏదేమైనా అర్థరాత్రి లేచి మరీ చూడాలంటే ఎంతో కష్టమైన విషయమే.