National

మేనకాగాంధీకి ఇస్కాన్ 100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు..!

దేశవ్యాప్తంగా ఆలయాలతో పాటు గోశాలలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి.

ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం వేస్తామంటూ నోటీసులు పంపింది.

ఓ వీడియోలో గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ఇవాళ ఆమెపై రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా వేస్తున్నట్లు నోటీసులు పంపింది. మేనక ఆరోపణలు భక్తులకు తీవ్ర మనోవేదన కలిగించినట్లు నోటీసుల్లో ఇస్కాన్ పేర్కొంది. వీటిపై వారం రోజుల్లోగా ఆమె స్పందించాలని కోరింది. ఇందులో విఫలమైతే ఆమెపై రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది.

ఇస్కాన్ పై మేనకా గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ దాస్ తెలిపారు. ఇస్కాన్‌పై నిరాధారణ ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు మేనకాగాంధీ ఆరోపణలతో ఆవేదనకు గురయ్యారని తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఇస్కాన్ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఇస్కాన్‌పై ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి న్యాయం పొందేంతవరకూ వెనక్కి తగ్గేది లేదన్నారు.

ఏపీలోని అనంతపూర్ లోని గోశాలలో పాలిచ్చే ఆవు ఒక్కటీ లేదంటూ మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఈ నోటీసుల్లో ఇస్కాన్ ప్రస్తావించింది. తాను స్వయంగా వెళ్లి చూడకుండా ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని నోటీసుల్లో ఇస్కాన్ ప్రశ్నించింది. గోవులన్నీ కసాయిలకు అమ్మేశారంటూ మేనక చేసిన విమర్శల్ని ఇస్కాన్ తీవ్రంగా తప్పుబట్టింది.