తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది.
తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది.
దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం, స్తబ్దత నెలకొంది. అయితే బీజేపీ కొత్త చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించడంతో పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నేత ఈటల రాజేందర్ నియామకంతో పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. పార్టీకి ఊపు తెచ్చేందుకు జాతీయ నాయకత్వం సైతం రంగంలోకి దిగింది. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్‌లో ఊపును కొనసాగించేలా..
మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడుగా ఉన్న కిషన్ రెడ్డి, పార్టీలోని అన్ని వర్గాల నాయకులతో కలుపుగోలుగా వెళ్తూ.. పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రెండుసార్లు బిజెపి చీఫ్‌గా వ్యవహరించిన కిషన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న దానిపై తర్జనభర్జనపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నాడు బీజేపీకి ఉన్న ఊపును తిరిగి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి పాత ఊపును కంటిన్యూ చేసేలా తగిన వ్యూహాలను పన్నుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు టూర్ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని కుటుంబ పాలన పోవాలంటే, బీజేపీని ఆశీర్వదించాలంటూ ప్రధాని మోడీ గర్జించారు. అదే సమయంలో తెలంగాణకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పసుపు బోర్డును సైతం మంజూరు చేయడం, పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈటలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం
తెలంగాణలో పసుపు బోర్డు ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు చేకూరుతుందని అంచనాలున్నాయి. ఇన్నాళ్లు పడిన కష్టాలకు శ్రమ ఫలితం లభించిందని రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన నాటి హామీలను వేటిని సవ్యంగా అమలు చేయకుండా చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ, ప్రధాని నరేంద్రమోడీ గిరిజన యూనివర్సిటీ సైతం మంజూరు చేశారు. ఏకంగా 900 కోట్ల రూపాయల వ్యయంతో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. తెలంగాణ పోల్ సినారియోను మరోసారి తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
అటు కిషన్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్ పార్టీని విజయతీరాలకు చేర్చేలా.. .ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయడం కూడా శ్రేణుల్లో ఉత్సాహం కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఏంటన్నదానిపై ఫోకస్ పెట్టి.. ఆ లక్ష్యంగా పనిచేయాలని నేతలకు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీకి విజయావకాశాలున్న సీట్లపై రిపోర్ట్‌ను తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమర్పించారు కూడా.
బలాలు బలహీనతలపై కమలం ఫోకస్
రేపు (మంగళవారం) ఎలక్షన్ కమిషన్ పెద్దలు తెలంగాణ పర్యటనకు రానున్న తరుణంలో,ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కాచివడపోశారు కూడా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ టికెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు విజయం సాధిస్తారు? ఎవరైతే గట్టి పోటీ ఇస్తారని పార్టీ లెక్కులు వేసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించుకున్న కమలనాధులు, బలాలు, బలహీనతలపై దృష్టి సారించారు. ఇక విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు ఈటల రాజేందర్ ఇద్దరూ కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోయి బీజేపీ సర్కారును తెచ్చేందుకు తగిన కసరత్తు చేస్తున్నారు.