CINEMA

ఎన్టీఆర్ స్పందించకపోతే ఏంటీ?: కేంద్రం, రోజాపై బాలకృష్ణ సంచలనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

అయితే, దివంగత ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీటీడీపీ కార్యకర్తలతో బాలకృష్ణ(Balakrishna) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని.. ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందే. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారన్నారు. రిమాండ్ లోకి తీసుకున్నాక సెక్షన్లు చెబుతున్నారన్నారు.

ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారన్నారు బాలకృష్ణ. అయితే, తెలంగాణలో మాత్రం కొందరు మూడు రోజుల నుంచి ఖండిస్తున్నారన్నారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు బాలకృష్ణ. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని.. ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగువారి గౌరవం కోసం పనిచేద్దామన్నారు.

కేసులకు అరెస్టులకు భయపడమని.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు బాలకృష్ణ. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలోపోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు టైం వచ్చిందని.. తప్పకుండా టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందన్నారు. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. తెలంగాణలో టీడీపీ లేదన్నవారికి తామేంటో చూపిస్తామన్నారు బాలకృష్ణ.

ఏపీలో సైకో పాలన నడుస్తోందన్న బాలకృష్ణ.. ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం ఉందన్నారు. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదన్నారు. అనవసరంగా తాము ఎవరిపైనా నిందలు వేయమన్నారు. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా తన సోదరి పురంధేశ్వరి ఉన్నారని.. ఆమెతో టచ్‌లో ఉన్నామన్నారు బాలకృష్ణ. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంపై కలుస్తామన్నారు. సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని కూడా పట్టించుకోనని చెప్పారు. ఇక ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ స్పందించారు. రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని వ్యాఖ్యానించారు. బురద మీద రాయి వేస్తే మనమీదే పడుతోందని చురకలంటించారు.