TELANGANA

తెలంగాణలో క్లియర్ `పిక్చర్`: ఆ పార్టీదే అధికారం: లేటెస్ట్ రిపోర్ట్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.

7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ పరిణామాల మధ్య తాజాగా అసెంబ్లీ ఎన్నికల సర్వే నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. లోక్‌పోల్ నిర్వహించిన సర్వే అది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరనేది అంచనా వేసిందా సంస్థ. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా వాటి ఫలితాలను విడుదల చేసింది. ఓ లోక్‌సభ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేది తెలియజేసింది.

ఈ రిపోర్ట్ బట్టి చూస్తే- ఈ దఫా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్- 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుంది ఈ సర్వే నివేదికను బట్టి చూస్తే.

అధికార భారత్ రాష్ట్ర సమితికి పరాభవం తప్పదని అంచనా వేసింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించబోవని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్- 45 నుంచి 51 స్థానాలకే పరిమితం అవుతుంది. ఆ పార్టీకి పడేది 39 నుంచి 42 శాతం ఓట్లు.

భారతీయ జనతా పార్టీ మాత్రం దారుణ పరాజయాన్ని చవి చూడటం ఖాయమైంది. బీజేపీ గెలిచేది 2-3 మూడు చోట్ల మాత్రమే. 10 నుంచి 12 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి పోల్ అవుతాయి. ప్రతిపక్ష హోదా కూడా బీజేపీ దక్కబోదని లోక్‌పోల్ సర్వే స్పష్టం చేసింది. మజ్లిస్ తన పట్టును కొనసాగిస్తుంది. 6 నుంచి 8 సీట్లను సొంతం చేసుకోగలుగుతుంది.