CINEMA

తీగ లాగిన ఈడీ: కదిలిన ఫిల్మ్ ఇండస్ట్రీ డొంక: స్టార్ హీరోయిన్, కమేడియన్‌కు కేంద్రం సమన్లు

ముంబై: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి కలకలం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కొరడా ఝుళిపించింది.

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు (Mahadev betting app case)లో దూకుడును పెంచింది. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మరిన్ని అరెస్టులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో తాజాగా ఈడీ (ED) తాజాగా ముగ్గురు సెలెబ్రిటీలకు సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ముగ్గురూ- హ్యూమా ఖురేషీ (Huma Qureshi), హీనా ఖాన్ (Hina Khan), కమేడియన్ కపిల్ శర్మ (Kapil Sharma).

ఈ ముగ్గురికీ సమన్లను జారీ చేసిన విషయాన్ని ఈడీ అధికారులు ధృవీకరించారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

రణ్‌బీర్ కపూర్‌కు నోటీసులు జారీ చేసిన తరువాత ఈడీ అధికారులు ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్టయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవస్థాపకుడు సౌరభ్ చంద్రకర్ వెడ్డింగ్‌లో సెలెబ్రిటీలు సందడి చేసిన విషయం తెలిసిందే.

ఈ వెడ్డింగ్ కోసం 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ఈడీ అంచనా వేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కాంతో దీనికి లింకులు ఉన్నట్లు గుర్తించింది. మనీలాండరింగ్ వ్యవహారంలో మహదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ యాజమాన్యం సిండికేట్గా పని చేసిందని ఈడీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.

మనీ లాండరింగ్ కోసం కొత్త యూజర్లు, కొత్త యూజర్ ఐడీలను క్రియేట్ చేయడం, బినామీ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులను బదిలీ చేయడం అనేవి ఈ యాప్ కార్యకలాపాలు. సౌరభ్ చంద్రకర్‌, రవి ఉప్పాలీ ఈ బెట్టింగ్ యాప్‌ రూపకర్తలు. దుబాయ్ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్నారు.