National

ఆ రూ.27 కోట్లు విరాళాలే- స్కిల్ స్కాం నిధులు కాదు- సీఐడీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ.27 కోట్ల నిధులు నిందితుల ఖాతాల నుంచి డొల్ల కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు నిన్న సీఐడీ ఏసీబీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది.

దీంతో ఈ స్కాంలో నిధులు టీడీపీకి చేరిన అంశంపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు రూ.371 నిధులు చేతులు మారాయని ఆరోపిస్తున్న సీఐడీ.. చివరకు రూ.27 కోట్ల నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు చేసిన ఆరోపణపై చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ దీనిపై స్పందించింది. ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన విరాళాల్ని స్కిల్ డెవలప్మెంట్ ఖాతాల నుంచి వచ్చిన నిధులుగా ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు సంబంధించి వాస్తవాలతో ఓ బుక్ ను టీడీపీ విడుదల చేసింది. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు నిధులు ఎలా వచ్చాయి, వాటిని ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారన్న అంశాల్ని పొందుపరిచింది. ఈ బుక్ విడుదల సందర్భంగా మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్కిల్ స్కాం ద్వారా ఏ ఖాతాలోకి అయినా రూపాయి వెళ్లిందని నిరూపించగలరా అని ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి జీవో జారీ చేసిన అప్పటి ఐఏఎస్ నీలం సాహ్నీపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. నిధుల విడుదలకు సంతకాలు చేసిన అజయ్ కల్లంతో పాటు ప్రేమ్ చంద్రారెడ్డి నిందితులు కారా అని అచ్చెన్న నిలదీశారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబును మాత్రమే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో ప్రతీ రాజకీయ పార్టీకి విరాళాలు వస్తాయని అచ్చెన్న తెలిపారు. అలాగే టీడీపీ ఖాతాకు కూడా విరాళాలు వచ్చాయన్నారు. వీటిని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసిన వివరాలతో ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన నిధుల్ని స్కిల్ స్కాం డబ్బులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. చంద్రబాబు అప్పటి పాలనకూ, జగన్ పాలనకూ ఎంతో తేడా ఉందన్నారు.