తెలంగాణ ఎన్నికల్లో సర్వేల నుంచి పంపకాల వరకు అంతా ఏపీ నేతలదే కీలకపాత్ర. ఇదేంటి తెలంగాణ ఎన్నికలతో ఏపీ నేతలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది వాస్తవమేనట. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ కు దన్నుగా నిలుస్తున్న ఆ ఇద్దరు ఎవరు?
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు తాము ఉన్నామంటున్నారు పలువురు వైసీపీ నేతలు. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తున్నదని టాక్. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు.. తెలంగాణ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారట.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు. కేసీఆర్ కానీ.. ఆయన కుటుంబసభ్యులు తిరుమలకు వెళ్తే దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆయనకు చెందిన కొన్ని టీంలు తెలంగాణలో సర్వేలు చేయడంలో బిజీగా మారింది. ప్రస్తుతం చెవిరెడ్డి టీంలు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు మినహా అన్ని నియోజకవర్గాల్లో చెవిరెడ్డి టీంలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో కొన్ని బృందాలు పనిచేస్తున్నాయట. టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ టీంలు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాయని తెలుస్తోంది.
ఇక అదే చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తెలంగాణ పాలిటిక్స్ తనవంతుగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారట. 2014-2019 వరకు జరిగిన మిషన్ కాకతీయ పనుల టెండర్లు దక్కించుకున్నది పెద్దిరెడ్డికి చెందిన కంపెనీలే. ఆ కాంట్రాక్టు సంస్థలకు చెందిన టీంలు ఇప్పుడు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాయి. అంతేకాదు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కూడా చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. కర్నూలు తెలంగాణకు బార్డర్‌గా ఉంది. దీంతో ఆ జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులకు చేదోడువాదోడుగా ఉన్నారట. ముఖ్యంగా సిటీలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సెటిలర్స్ ను ప్రభావితం చేసేందుకు ఈ బృందాలు పనిచేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
2018 ఎన్నికల్లోనూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ చేయగా మిగిలిన వాచ్‌లు అప్పట్లో చంద్రగిరిలో దర్శనమిచ్చాయి. అంతేకాదు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వాడిన వాహనాలను అక్కడికి తరలించి స్టిక్కరింగ్ మార్చేసి వాడుకున్నారట. ఇలా పరస్పర సహకారంతో రెండు పార్టీలు కూడా ఒకే తరహా వ్యూహం అమలుచేసి గతంలో విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల తర్వాత మరికొంత మంది వైసీపీ నేతలు.. తెలంగాణ ఎన్నికల్లో యాక్టివ్ అవుతారని సమాచారం అందుతోంది. అయితే ఈ అవగాహన రెండు పార్టీల నేతల మధ్య ముందునుంచి ఉందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.