TELANGANA

ఘర్షణలు, నిరసన సెగలతో వరంగల్ జిల్లాలో ఉత్కంఠగా సాగిన పోలింగ్..!!

వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా కొనసాగింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల కంటే, అతి ముఖ్యమైన నియోజకవర్గంగా భావించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం లో అత్యల్పంగా పోలింగ్ నమోదయింది. ఇది రాజకీయ పార్టీలకు నిరాశను కలిగించింది. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ గా మారుతుంది అన్న చర్చ జరుగుతుంది.

 

 

 

 

ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్ లో వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. నర్సంపేట నియోజకవర్గం లోని దుగ్గొండి మండలం నారాయణ తండా పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగగా, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

 

బూత్ లోపలికి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఇరు పార్టీల శ్రేణులు దాడులకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దు మణిగించారు. ఇదిలా ఉంటే అయినవోలు మండలం ఒంటిమామిడి పల్లిలో బి ఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు స్థానికుల నుండి నిరసన సెగ తగిలింది.

 

 

 

 

తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరూరి రమేష్ ను అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు, ఆరూరి రమేష్ అనుచరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, తోపులాట జరిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.

 

 

 

 

వరంగల్ జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఈసారి యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఐదు మహిళలచే నిర్వహించబడే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ఒక పిడబ్ల్యుడి పోలింగ్ కేంద్రాన్ని, యువ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఓటర్ల మనసుకు హత్తుకునేలా చేశారు.

 

ఎన్నికల అధికారులు ఓటర్లకు అడుగడుగునా సహకరిస్తూ, వారి పోలింగ్ కొనసాగేలా చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 338 మంది హిజ్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకొని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇక ఫైనల్ గా జిల్లావ్యాప్తంగా ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైంది. ఈ తీర్పు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.