టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. జనసేనతో పొత్తు ఖాయమైన వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ తో పొత్తుకు ప్రయత్నిస్తున్న వేళ నిర్ణయం జరిగిన తరువాత సీట్ల పంపకాలు..అభ్యర్దుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా కసరత్తు జరుగుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపు పైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు. సర్వేలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న ఆయన మరోవైపు నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడైతే మార్పులు అవసరమో అక్కడ వాటిని తక్షణమే చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రధానంగా ప్రజల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం వ్యక్తం కాకుండా అన్ని అంశాలను సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఖాళీల భర్తీతో పాటు నియామకాలు ప్రారంభించారు. జనసేనతో పొత్తు వేళ ఆ పార్టీకి ఇచ్చే సీట్ల పైన ఇప్పటికే చంద్రబాబు ఒక అంచనాకు వచ్చారు. దీనికి అనుగుణంగానే ఇంఛార్జ్ ల మార్పు చేస్తున్నట్లు సమాచారం.
జనసేనతో పొత్తు వేళ వివాదాలు.. కేడర్‌లో వ్యతిరేకత ఉన్న ఇంఛార్జ్‌లను తొలగిస్తూ కొత్తవారిని నియమిస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈ చర్యలతో పార్టీ సీనియర్ నేతల కొందరికి షాక్ తప్పటం లేదు. జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో అసెంబ్లి సెగ్మెంట్ల వారీగా ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లను ప్రాతిపదికగా తీసుకుంటున్న టీడీపీ అధిష్టానం మార్పులకు దిగింది.
ఇటీవలే కడప జిల్లా బద్వేల్ ఇన్‌చార్జిల బొజ్జా రోషన్న, సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ, గంగాధర నెల్లూరుకు వీఎం థామస్, రాజానగరంలో బొడ్డు వెంకటరమణ, గన్నవరానికి యార్లగడ్డ వెంకట్రావును ఇన్‌చార్జిలగా నియమించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పార్టీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో కూడా మార్పు చేశారు. భూమా కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కకు పెట్టి ఆయన స్థానంలో మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను నియమించారు. ఈ నియామకం సీనియర్లను షాక్‌కు గురిచేసింది.
కసరత్తు వేగవంతం ఇంకోవైపు మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఈసారి ఆమెకు పోటీచేసే అవకాశం దాదాపుగా లేనట్లుగానే కనిపిస్తోంది. ఈ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. గతంలో వైసీపీ, టీడీపీలో పనిచేసిన ఇరిగెల రామ్‌పుల్లారెడ్డి ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కీలక నేతగా ఉన్న ఆయన ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్‌ను జనసేన నుంచి ఆశిస్తూ ఉండటంతో అఖిలప్రియకు సీటు ఖరారు సందేహంగా మారింది.
తాజాగా చంద్రబాబు అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిని హైదరాబాద్‌కు పిలిచి వారితో మాట్లాడారు. బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని టీడీపీ అధినేత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న ఇంఛార్జ్‌ల పోస్టులను అధిష్టానం భర్తీ చేయనుంది. ఇంకోవైపు సర్వే నివేదికలు, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను చంద్రబాబు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.