TELANGANA

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.

 

సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తమకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.

 

Telangana congress leaders meet governor tamilisai for formation of govt

సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ లో ఒక విధానం ఉంటుందని.. ఆ ప్రకారమే ప్రక్రియ ఉంటుందని డీకే శివకుమార్ వివరించారు. కాగా, సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇది ఇలావుండగా, కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజల తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామన్నారు. ప్రగతి భవన్ ప్రజా భవన్ గా మారుతుందన్నారు. సచివాలయానికి ప్రజలు ఎప్పుడైనా రావచ్చని అన్నారు.

 

కాగా, కొడంగల్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విజయం సాధించారు. 31,849 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై విజయం సాధించారు. కొడంగల్‌లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు రేవంత్.