TELANGANA

ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

 

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. 119 స్థానాలకు గానూ ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఎంత విశ్వాసనీయతతో సేవలందించామో అదే విధంగా పనిచేస్తామన్నారు. ఎదురుదెబ్బను ఒక గుణపాఠంగా తీసుకుని.. పాఠాలు నేర్చుకుంటామన్నారు.

 

We will bounce back: KTR on telangana assembly election results.

ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు.. పల్లాలు చూశామన్నారు కేటీఆర్. అనుకున్న లక్ష్యం తెలంగాణ సాధించామన్నారు. ప్రజల దయతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టామన్నారు. చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తి ఉందని తెలిపారు. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపర్చినా.. బాధలేదన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని అన్నారు.

 

‘ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది వేవ్‌ అయితేనేమో రాష్ట్రమంతా ఒకేలా ఉండేది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. మెదక్‌ జిల్లాలో దాదాపు ఏకపక్షంగా ఉంది. కరీంనగర్‌లో 40-60శాతంగా ఉన్నది. ఇది వేవ్‌లా లేదు. సేమ్‌ టైమ్‌ అర్థం కాకుంటా ఉంది. మా నాయకులు, అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వారి అనుభవాలను కూడా తెలుసుకుంటాం’ అని కేటీఆర్ చెప్పారు.

 

‘పెద్దపల్లి పార్లమెంట్‌లో చెన్నూరులో బాల్క సుమన్‌ చేసినంత అభివృద్ధి మంత్రులుగా చేసినవారు లేరు. సింగరేణికి మేం చేసినంత మేలు ఎవరూ చేయలేదు. సింగరేణిని ప్రైవేటీకరణ అడ్డుకోవడం.. కార్మికులకు బోనస్‌ ఇచ్చాం. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్‌ సమస్యను పరిష్కరించాం. కానీ, ఇవాళ అక్కడ చూస్తే అక్కడ సాధారణ మెజారిటీ వచ్చింది. ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది’ అన్నారు కేటీఆర్.

 

‘ఇంకా కూలంకషంగా ఆలోచించి చర్చించాలి. మా కార్యకర్తలు, నాయకులు 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేందుకు కష్టపడ్డారు. వారికి నా అభినందనలు. ఎన్నికల్లో సహజంగా ఆశిస్తాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు.. 70 సీట్లు వస్తాయని చెప్పాం. తప్పని ప్రూవ్‌ చేస్తామని చెప్పాం. కానీ నేను అనుకున్నది రాలేదు. కొంత నిరాశ ఉంది కానీ.. బాధ లేదు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

ప్రజలకు మాకు రెండుసార్లు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రజానీకానికి సర్వదా రుణపడి ఉంటాం. పది సంవత్సరాలు అవకాశం కల్పించారు. వేరే వాళ్లకు అవకాశం ఇచ్చారని తిట్టిపోయడం అనేది.. నిందించడం అనేది భావ్యం కాదు. రాజీకాయాల్లో హుందా తనం, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు అది నేర్పించాడు. మా నాయకుడు ఏం అంటడంటే.. గెలవంగానే పొంగిపోవద్దు.. ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా నాయకులు, కార్యకర్తలకు చెప్పేది అదే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

గెలిచినప్పు పొంగిపోవడం.. ఓడిపోగానే కుంగిపోవడం ఓ రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ధీరోదాత్తంగా పోరాడం. మేం ఇలాంటివి ఎన్నో చూశాం. మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు.. మా పార్టీని ఫినిష్‌ చేయాలనే ప్రయత్నాలను ఎన్నో చూశాం. కాబట్టి ఎందుకు ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారు.. దాన్ని మే గౌరవిస్తాం. ఇవాళ మేం ఓడిపోయాం. కానీ, ప్రతి రోజూ ఇదే జరుగదు. ఇవాళ ఆదివారం.. ప్రతిరోజూ ఆదివారం కాదు. ఇది గుర్తించుకోవాలి. మేం మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాం’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు.

 

రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని అన్నారు కేటీఆర్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి కేటీార్ అభినందనలు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి శుభకాంక్షలు చెబుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడి మళ్లీ తాము ముందుకు వస్తామన్నారు.