TELANGANA

ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం.. ఆ ఆఫీసర్లపై సిఎం రేవంత్ నిఘా!..

సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు సమీక్షలు కొనసాగిస్తూనే ఇంకోవైపు అధికారుల బదిలీలు, నియామకాలపై కసరత్తులో వేగం పెంచేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్న ఆఫీసర్ల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెడ్ డైరీలో ఎవరెవరున్నారోనన్న టెన్షన్ చాలా మందిలో పట్టుకుంటోంది.

 

సీఎం రేవంత్ రెడ్డి రోజుకు ఒకటి రెండు సమీక్షలతో బిజీబిజీగా ఉంటున్నారు. కీలక నిర్ణయాల దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు తన మార్క్ పాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ట్రైలర్ చూపించారు. అసలు సినిమా ముందుందంటున్నారు. సీఎంగా తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంతో పాటే.. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే తన మార్క్ ఏంటో నిరూపించుకొనేలా అడుగులు వేస్తున్నారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొందరు అధికారులు తమ పోస్టులకు ఎసరు తప్పదని ముందుగానే అంచనా వేసుకుంటున్నారట. ఎందుకంటే ప్రచారాల సమయంలో రేవంత్ రెడ్డి ఓ మాట చెప్పారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్ల పేర్లు రెడ్ డైరీలో ఎక్కుతున్నాయన్నారు. దీంతో ఆ డైరీలో ఎవరు ఉన్నారా అన్న టెన్షన్ అధికారులకు పట్టుకుంది. ఇంకోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు తమను ఎక్కడ బాధ్యులు చేస్తారా అన్న టెన్షన్లు పెరుగుతున్నాయి.

 

పార్టీలకు ఎవరూ నిధులు ఇవ్వకుండా కొందరు అధికారులు పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ తరుపున వారే విరాళాలు వసూలు చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అలాంటి వారిపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అటు సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చిన సీఎం రేవంత్…. మరో నాలుగు ప్రధాన శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. కేబినెట్ లో ఇంకా ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండటంతో రేవంత్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతోంది.

 

కీలకమైన హోం శాఖ సీఎం దగ్గరే ఉంది. సీనియర్లు దాదాపుగా కేబినెట్ లో చేరారు. మంత్రివర్గంలో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని రేవంత్ భావించినా.. హైకమాండ్ మరి కొంత కాలం ఆగాలని సూచించినట్లు తెలుస్తోంది. హోం తో పాటుగా, విద్య, మున్సిపల్, ఎస్సీ సంక్షేమం వంటి శాఖలను ఎవరికీ కేటాయించలేదు. కీలకమైన మున్సిపల్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. అయితే ఇక్కడ అసలు కథ ఉంది. గతంలో ఓఆర్ఆర్ టెండర్ల రద్దు విషయంలో రేవంత్ రెడ్డి గట్టిగా పోరాటం చేశారు. అయితే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న అరవింద్ కుమార్ మాత్రం రేవంత్ కు లీగల్ నోటీసులు పంపారు. అవి వెనక్కు తీసుకోకపోతే ఐఏఎస్ అరవింద్ కుమార్ పై న్యాయపోరాటం తప్పదని అప్పట్లో రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో ఇప్పుడు అరవింద్ కుమార్ పోస్ట్ ఉంటుందా.. బదిలీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

అటు హైదరాబాద్ లో ఫలితాలను లెక్కలోకి తీసుకొని మున్సిపల్ – హోం శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ పై పట్టు కొనసాగించేందుకే సీఎం రేవంత్ హోం శాఖను తన వద్ద ఉంచుకోవటంతో పాటుగా రాజకీయంగానూ కొత్త అడుగులు వేస్తున్నారు. తన మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.