TELANGANA

లోక్‌సభ బరిలో ఈటల.. రేవంత్ రెడ్డి స్థానంపై కన్ను

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.

 

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

 

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. 17 లోక్‌సభ నియోజకవర్గాలకూ రాజకీయ ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడం, సమర్థుడైన అభ్యర్థి పేరును వాళ్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

 

మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు లోక్‌సభ బరిలో నిల్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి- తనకు అచ్చి వచ్చిన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నారు. ప్రస్తుతం ఆయన ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

 

బీజేపీకే చెందిన మరో సీనియర్ నేత ఈటల రాజేందర్.. లోక్‌సభ బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి, పరాజయం పాలైన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌తో తలపడ్డ ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు.

 

ఈ సారి ఆయన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మల్కాజ్‌గిరి లేదా మెదక్ స్థానాలను పరిశీలిస్తోన్నారు. మెదక్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మల్కాజ్‌గిరి నుంచి పీ మురళీధర్ రావు లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్కా కొమరయ్య పేర్లు కూడా బీజేపీ పరిశీలనలో ఉన్నాయి.

 

మల్కాజ్‌గిరి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కొమరయ్య ఇప్పటికే ప్రచారం సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అదే ఖాయమైతే- ఈటల రాజేందర్.. మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇది. మొన్నటి వరకు ఆయన ఇదే స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందు వల్ల తన లోక్‌సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.