TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీంలకు ఆమోదం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు వివరాలను సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌కు టీజీగా మార్పు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. మరో రెండు గ్యారంటీల అమలుకు ఆమోదం తెలిపారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

 

 

తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయించినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదించారు. ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి ప్రక్రియ మొదలైందని తెలిపారు. గత పాలనలో రాచరిక పోకడలే తప్ప.. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదని మంత్రులు విమర్శించారు.

 

 

65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించారు.తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఆదేశాలు

 

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.