TELANGANA

సోనియా తెలంగాణ నుంచే పోటీ: బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలంటూ రేవంత్ ఫైర్, ఇక ఊరుకోవద్దు!

హైదరాబాద్: ప్రతిపాక్ష పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).

హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi)ని పోటీ చేయాలని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం చేశారు.

దీంతో పాటు మరో రెండు తీర్మానాలను ఈ సమావేశంలో సీఎం ప్రతిపాదించారు. మొదటి తీర్మానంగా ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీకి అభినందనలు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పని చేసిన మాణిక్‌ రావు ఠాక్రేకు అభినందనలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని చెప్పారు. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్‌ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్‌ఎస్‌ దోచుకుందని ఆరోపించారు.

ఇకపై బీఆర్‌ఎస్‌ విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలని పీసీసీ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు టార్గెట్‌ 17 పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్నారు. జనవరి 8న ఐదు జిల్లాలు, 9వ తేదీన మరో ఐదు జిల్లాల నేతలతో సమీక్షిస్తానని సీఎం రేవంత్‌ చెప్పారు. జనవరి 10 నుంచి 12 వరకు 17 పార్లమెంటు ఇంఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. జనవరి 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని రేవంత్ వెల్లడించారు.

మరోవైపు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు రేవంత్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఆదాయం తగ్గినట్లు ఉందని.. అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. అనాడు తాను స్వయంగా సీబీఐ ఎంక్వయిరీ కోరినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్‌ రెడ్డి అడుగుతున్నారన్నారు. కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడీషియల్‌ విచారణ చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.