చెంగిచెర్లలో ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, గురువారం గోషామహల్బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ను పోలీసులు హౌస్అరెస్టు చేశారు. అయితే, పోలీసుల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్లకు బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే.. తనను అడ్డుకుని హౌస్అరెస్టు చేశారని రాజాసింగ్మండిపడ్డారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజా సింగ్ ధ్వజమెత్తారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారని రాజాసింగ్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రభుత్వంలో హిందువులపై దాడి జరిగిందని, ఇప్పుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) హయాంలోనూ అదే తరహా దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదని రాజా సింగ్ విమర్శించారు. హిందువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చెంగిచెర్ల బాధితులను కలిసేందుకు వెళ్లిన బండి సంజయ్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసులు బాధితుల వైపు కాకుండా.. నిందితుల వైపు ఉంటున్నారని ఆరోపించారు.బాధితులపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చే బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారన్నారు.
ఇది ఇలావుండగా, మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బోడుప్పల్ నగర పాలక సంస్థ చెంగిచర్లలో హోలీ వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాడి చేయడంతో ఓ వర్గానికి చెందిన కొందరు మహిళలు, యువకులు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే గాయపడిన బాధితులను పరామర్శిచేందుకు బండి సంజయ్, ఘట్‌కేసర్ ఎంపీపీ వై సుదర్శన్ రెడ్డి, భారీగా పార్టీ కార్యకర్తలతో తరలివెళ్లారు. అయితే, అక్కడ విధులు నిర్వహిస్తున్న నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి, ప్రస్తుతం నిషేధిత ప్రాంతమని, గాయపడిన వారి వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులకు, బండి సంజయ్ (Bandi Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులను నెట్టేసి మరీ బాధితులను కలవడానికి బీజేపీ నాయకులు వెళ్లారు.
చివరకు బాధితులను కలిసిన బండిసంజయ్.. వారిని దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి స్థానికులతో వారి సమస్యలపై మాట్లాడారు. తనపై దాడి చేసి, కిందపడేసి తొక్కుకుంటూ వెళ్లారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో.. బండి సంజయ్, ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు పలువురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
చెంగిచెర్లకు వెళితే ఎందుకు అడ్డుకుంటున్నారని.. అదేమైనా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు బండి సంజయ్. చెంగిచెర్ల ఘటనపై బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్. 300 మంది ఒక మూకగా వచ్చి దళిత, గర్భిణీ స్త్రీలపై దాడి చేశారని ఆరోపించారు. ఇది గత భైంసా ఘటనను గుర్తు చేసిందన్నారు. చెంగిచెర్లకు రావడానికి కాంగ్రెస్ వాళ్లకు మనసొప్పడం లేదని.. తాము వెళితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.