రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ’ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం
ఈ కీలక భేటీకి కమిటీ సభ్యులైన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి లోతుగా సమీక్షించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలని స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు.
ప్రతీ శుక్రవారం మీటింగ్
ముందస్తుగా నిర్దేశించుకున్న టైమ్ లైన్ (క్యాలెండర్) ప్రకారమే అన్ని శాఖల అధికారులు ఆదాయాన్ని పెంపొందించేందుకు శ్రమించాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు. అనివార్య కారణాలవల్ల ఈ సమావేశానికి రానటువంటి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశించారు .రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను అధికారులను ఆదేశించారు .
మే 28 నుంచి భూముల సవరణ
రాష్ట్ర క్యాబినెట్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. మే 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సవరించిన (పెంచిన) భూముల మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్ ధరలు) అమలులోకి రానున్నాయని అధికారులు ఈ సమావేశంలో మంత్రుల బృందానికి వివరించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించిన ‘హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్’ సిద్ధమయ్యాయని, వీటికి సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే వెలువడనున్నాయని అధికారులు వెల్లడించారు.
అధికారులకు దిశా నిర్దేశం
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ , హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ , పరిశ్రమలు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రెవెన్యూ, రవాణా తదితర కీలక శాఖలలో ప్రస్తుత వనరుల పురోగతి, రాబోయే రోజుల్లో సాధించాల్సిన ఆదాయ లక్ష్యాలపై మంత్రుల బృందం అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవిన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

