పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్‌లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాలు
ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు వారితో సన్నిహితంగా వ్యవహరించినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం.
రెండు నకిలీ పిస్టల్స్..
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్, స్క్రీన్షాట్లు ఉన్నట్లు సత్యనారాయణ వెల్లడించారు. అదేవిధంగా రెండు నకిలీ పిస్టల్స్‌ను కూడా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో డిఐ కిరణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

