కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారు.. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దు అంటారు. మంత్రులు మాత్రం 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్‌ది ఒక మాటనా? మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా? రామప్ప కింద తూములు మూసేశారు. నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి? గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి. అయినా కలెక్టర్ ఎందుకు తూములు మూసారు?..ఎవరు కరెక్ట్?..మంత్రులు రైతులకు క్షమాపణలు చెప్పాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
మంత్రికి తెలియదని ఎద్దేవా..
దేవాదుల పంపులు ఆన్ చేయమని నిలదీస్తే మంత్రులు ఉత్తం, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారన్నారు. అక్కడికి వెళ్లి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం అని చెప్పారని, ఆ మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారన్నారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు.. నీళ్లు ఎత్తడం లేదని మండిపడ్డారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని, నీళ్లు ఉండి కూడా ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు.
ఈనెల 13న..
కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ నిర్మించారని, 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. 22 వేల క్యూసెక్కుల వరద ఉందన్నారు. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13న మొత్తం నీళ్లు ఎత్తుతామని చెప్పారని ఏమైందని నిలదీశారు. దేవాదులకు మంత్రులు వెళ్లినప్పుడు 7 మోటార్లు, ఇప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఇక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదు కదా? అని ప్రశ్నించారు. ఏపీకి నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? మీ ఆలోచన ఏమిటి? అని నిలదీశారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని దుయ్యబట్టారు. సమ్మక్క బ్యారేజీ కట్టి, దేవాదుల మూడు ఫేజులు పూర్తి చేసి కేసీఆర్ నీళ్లు ఎత్తడానికి సిద్ధంగా పెట్టారన్నారు.
మొద్దునిద్ర పోతున్నారా?
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారన్నారు. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేశామన్నారు. కటుక ఒత్తకుండా ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు?రూ.8 కోట్ల బిల్లులు ఇవ్వకుండా పోయిన ఏడాది 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ చేశారన్నారు.దేవాదుల కింద రూ.700-800 కోట్ల విలువైన పంట ఎండిపోయిందన్నారు. ఈసారి కూడా ఎల్‌నినో వస్తుందని చెబుతున్నా మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడా డ్రామాలు.. ఇక్కడ ఎందుకు ఎత్తరు?రామప్ప కింద 5 వేల ఎకరాలు, పాకాల కింద 29 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. దేవాదుల మోటార్ల కు మరమ్మతులు చేయకుండా, ట్రాన్స్ ఫార్మర్లకు రిపేర్ చేయకుండా నేరపూరిత నిర్లక్ష్యం అవలంబిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు.
ఏం అడ్డం వచ్చింది?
గ్యారెంటీల విషయంలో వాయిదాల లెక్కనే.. నీళ్ల ఎత్తిపోతల విషయంలో కూడా వాయిదాలేవేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే మా మీద పడి ఏడ్చారు. దేవాదుల వద్ద ఏం అడ్డం వచ్చింది?జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 50 రోజులు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. 2011లో దేవాదుల టన్నెల్ కూలిందని మేం బాగు చేశామన్నారు. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదు అని హెచ్చరించారు. తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై లేదన్నారు.

