AP

కేంద్రం నుంచి జగన్‌కు శుభవార్త- ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా: విశాఖలో..!!

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు.

తొలి రోజే 11.50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు.

కేంద్రం నుంచి గడ్కరీ..

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం ఆయన సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై వరాలజల్లు కురిపించారు. ఉత్తరాంధ్ర దశ, దిశను మార్చే వరాలు అవి. చాలాకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన ప్రాజెక్టులు అవి. వాటికి అనుమతులను మంజూరు చేస్తోన్నట్లు.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక మీది నుంచే ప్రకటించారాయన. ఈ ప్రకటన చేసిన తరువాత- వైఎస్ జగన్, ఆయన పక్కనే కూర్చున్న గ్రంధి మల్లికార్జున రావు చప్పట్లు కొట్టి అభినందించారు.

రూ.6,300 కోట్లతో..

విశాఖపట్నం పోర్ట్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించడానికి అనుమతులను మంజూరు చేస్తోన్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. భోగాపురంలో ఏర్పాటు కాబోతోన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు అనుసంధానించేలా ఈ విశాఖపట్నం పోర్ట్ హైవేను ఆరులేన్లుగా విస్తరిస్తామని అన్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిని భోగాపురం వద్ద 6,300 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు.

జగన్ చాలాసార్లు అడిగారు..

ఈ ప్రాజెక్ట్ కోసం వైఎస్ జగన్ చాలాసార్లు తనను సంప్రదించారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. మూడు సంవత్సరాలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, విద్యుత్, రవాణా, జల వనరులు, కమ్యూనికేషన్ల వ్యవస్థలో అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. అలాంటి రాష్ట్రానికి రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని, అందుకే 6,300 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ పోర్ట్ ను అనుసంధానించే 16వ నంబర్ జాతీయ రహదారిని భోగాపురం వద్ద ఆరులేన్లుగా విస్తరించదలచుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి..

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని ప్రశంసించారు. ఇంధన భద్రత- పునర్వినియోగం, పారిశ్రామిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని, స్వదేశీ తయారీపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎకానమీకి అవకాశాలను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు.

20 వేల కోట్లు..

రోడ్ కనెక్టివిటీని పెంచడానికి 20,000 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 50-50 ప్రాతిపదికన ఏపీలో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు. సుదీర్ఘమైన సముద్రతీరాన్ని పెట్టుబడులకు అనుకూలంగా మార్చుకుంటామని చెప్పారు.