ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన చీఫ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయంటూ ఒక ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్. ‘అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు సరైన దారి చూపారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న ప్రభుత్వం తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు’ అని పేర్కొన్నారు పవన్.
కాగా ఏపీ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్, అలాగే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.. ఇలా అందరూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు.