ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు కులాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో కాపు సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీకి కాపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు మాజీ మంత్రి చినరాజప్ప.
ప్రారంభం నుంచి కాపులు, బీసీలే టీడీపీకి అండగా ఉన్నారు…చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది… గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో రాజకీయంగా నష్టపోయాం… కాపులకు చంద్రబాబు ఎంతో లబ్ది చేకూర్చినా కొందరు దుష్ప్రచారం చేశారన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప. కాపు యువత అటూ ఇటూగా ఉన్నా.. కాపు పెద్దలు చంద్రబాబుపై నమ్మకంతో ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే… బీసీలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లను చంద్రబాబు కల్పించారన్నారు.
మరోవైపు చంద్రబాబు వైసీపీ నేతల తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనం పై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతి రోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందన్నారు చంద్రబాబు.