AP

ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్‌ డ్రామా ట్రూప్ వివేకా హత్య కేసులో అడ్డంగా బుక్కయి రోజుకో కధ చెపుతూ మమ్మల్ని అరెస్ట్‌ చేయకండి బాబో.

అంటూ హైకోర్టును వేడుకొంటోంది. అయితే ఈ డ్రామా ట్రూప్ మొట్టమొదటే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఒకవేళ గత ఎన్నికలలో అవినాష్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెట్టాలని జగన్‌ రెడ్డి నిర్ణయించుకొని ఉండి ఉంటే, బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించవచ్చు. కానీ అలా ప్రయత్నించకుండా గొడ్డలి వేటు వేసి పైకి పంపించేసింది! అప్పుడు ఆ నేరాన్ని టిడిపి మీదకి నెట్టేసి ఎన్నికలలో సానుభూతి ఓట్లు సంపాదించుకొని గెలిచేసింది. కానీ ఇప్పుడు అదే వివేకానంద రెడ్డి హత్య కేసు వైసీపీ నేతల మెడలకి ఉరితాడులా చుట్టుకొని బిగుసుకుపోతోంది. ఈవిదంగా జరుగుతుందని ఊహించకపోవడంతో ఆ డ్రామా ట్రూప్ ఏం చేయాలో పాలుపోక విలవిలలాడుతున్నారు. అయినా భూకాయింపులు మానుకోవడం లేదు. కానీ దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా?” అని నారా లోకేష్‌ అన్నారు.

2019 ఎన్నికలలో వైసీపీకి వరంగా మారిన వివేకా హత్య కేసే ఈ ఎన్నికల ఏడాదిలో వైసీపీకి శాపంగా మారబోతుండటం చూస్తే నిజంగా దేవుడి స్క్రిప్టే అనిపించకమానదు. అయితే ఇందులో వైసీపీ స్వయంకృతాపరాధం కూడా ఉందనే చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సిట్‌ బృందం దర్యాప్తు చేస్తున్నప్పుడే ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చి ఉంటే నేడు ఇటువంటి దుస్తితి, ఆందోళన ఉండేవే కావు.

కానీ సీబీఐని పిలిచి దాని చేతికి ఈ కేసును అప్పగించడం మొదటి పొరపాటు. ఆ తర్వాత ఈ కేసును నాలుగేళ్ళపాటు ముందుకు సాగనీయకుండా సీబీఐతో ఆటలు ఆడుకోవడం రెండో పొరపాటు. ఒకవేళ అప్పుడే సీబీఐకి సహకరించి, నిందితులను జైలుకి పంపించి ఉండి ఉంటే, ఈపాటికి ప్రజలు కూడా ఈ కేసు గురించి మరిచిపోయి ఉండేవారు. కానీ ఎన్నికల సంవత్సరం వరకు కేసును ఈడ్చుకొని రావడం మరో పొరపాటు.

అన్ని సాక్ష్యాధారాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులను నిందితులుగా నిరూపించేందుకు సిద్దమైనప్పుడు కూడా వైసీపీ ఇంకా వారిని వెనకేసుకువస్తుండటం ఇంకో పొరపాటు అని చెప్పవచ్చు. ఈ తప్పటడుగులు సరిపోవన్నట్లు ఎన్నికల సంవత్సరంలో వైసీపీ చేతే వైఎసార్ కుటుంబం పరువు తీయించుకొంటుండటం ఇంకా విడ్డూరమైన విషయం.

దేవుడే వైసీపీని ఈవిదంగా నడిపిస్తున్నాడేమో?అందుకే వైసీపీ తాను కూర్చొన్న కొమ్మను నరుక్కొంటోందేమో?అనిపించక మానదు. నారా లోకేష్‌ ఇదే చెప్పారు కదా?