AP

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ రోజుకో ఊహించని మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాకు తీసిపోకుండా సాగుతోంది. తాజాగా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన తాజా వాంగ్మూలం మొత్తం ఈ కేసు విచారణనే మలుపు తిప్పేలా ఉంది.

దానిలో ఆమె తనను వివేకానంద రెడ్డి 2010లో వివాహం చేసుకొన్నారని, మళ్ళీ 2011లో ఇస్లాం మతసాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకొన్నామని తెలిపారు. 2015లో తమకు కుమారుడు జన్మించాడని, అతనికి షెహన్ షా అని పేరుపెట్టుకొన్నామని తెలిపారు. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని ఆమె తెలిపారు.

తమ వివాహం వివేకా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని, వివేకా గన్‌మెన్‌ ఎన్.శివప్రకాశ్ రెడ్డి, సునీతా రెడ్డి తనను తరచూ ఫోన్‌లో బెదిరించేవారని షమీమ్ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు. వివేకాతో వివాహం అయిన తర్వాత ఆయన తన సోదరుడు బాషా సాహబ్ భాయ్‌జాన్ను తన పీఏగా నియమించుకొన్నారని ఆమె పేర్కొన్నారు.

తన సోదరుడు వివేకా వెన్నంటి ఉంటూ ఆయన ఆహారం, ఆరోగ్యం గురించి చూసుకొంటూ చేదోడు వాదోడుగా ఉండేవాడని తెలిపారు. దీంతో వివేకా తన సోదరుడికి ఉండేందుకు ఇల్లు కూడా ఇచ్చారని షమీమ్ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ9 ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది.

ఒకవేళ సునీతారెడ్డి తనను బెదిరించి ఉంటే, వివేకా హత్య తర్వాత ఇంతకాలం (నాలుగేళ్ళు) ఆమె ఈ విషయం సీబీఐకి చెప్పలేదా లేదా చెప్పినా సీబీఐ పట్టించుకోలేదా?నేడో రేపో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయబోతుంటే ఇప్పుడే ఈ విషయం బయటకు లీక్ చేయడానికి కారణం ఏమిటి?అనే సందేహాలకు బహుశః త్వరలోనే వైసీపీ ద్వారా జవాబులు లభిస్తాయేమో?