మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించి వార్తల్లో వ్యక్తిగా మారారు సూరత్ కోర్ట్ న్యాయమూర్తి హరీష్ హస్ ముఖ్ భాయ్ వర్మ.
పరువు నష్టం కేసులో అంత పెద్ద శిక్ష అవసరమా అనే వాదనలు వినిపించాయి. ఆ శిక్ష వల్లే రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు, ఎంపీగా తాను ఉంటున్న బంగ్లాను కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ తీర్పుపై పైకోర్టుల్లో రాహుల్ న్యాయపోరాటం చేస్తున్న సందర్భంలో ఆయనకు శిక్ష విధించిన జడ్జికి సడన్ గా ప్రమోషన్ రావడం సంచలనంగా మారింది. HH వర్మకు జిల్లా జడ్జిగా పదోన్నతి లభించింది.
చివర్లో ట్విస్ట్..
HH వర్మతోపాటు మరో 68మంది న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్ లో పదోన్నతి దక్కింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ పదోన్నతి సరికాదని, వారి ప్రమోషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జ్ కేడర్ కి చెందిన ఇద్దరు అధికారులు వారి ప్రమోషన్లను సుప్రీంలో ఛాలెంజ్ చేశారు. ఈ పిటిషన్ పై ఈనెల 8న విచారణ జరుగనుంది.
‘మెరిట్- కమ్- సీనియారిటీ’ ఆధారంగా న్యాయ వ్యవస్థలో ప్రమోషన్లు ఉండాలి. కానీ ‘సీనియారిటీ- కమ్- మెరిట్’ ఆధారంగా ఈ ప్రమోషన్లు ఇచ్చారనేది పిటిషనర్ల వాదన. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు జారీ చేసిన సెలక్షన్ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ ప్రమోషన్ జాబితాలో పేరున్న న్యాయమూర్తి HH వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. రాహుల్ గాంధీకి శిక్ష విధించారన్న కారణంతో ఆయనకు దొడ్డిదారిన ప్రమోషన్ ఇచ్చారంటూ అప్పుడే కాంగ్రెస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి.