AP

సింగిల్ సింహానికి పొత్తులంటే ఎందుకంత భయం.?

వేదికలెక్కి ప్రసంగాలు.. అందులో మళ్ళీ రాజకీయ విమర్శలు.! జరుగుతున్నది పార్టీ మీటింగులో, అధికారిక కార్యక్రమాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

జనం సొమ్ముతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రచారం నానాటికీ వెర్రి తలలు వేస్తోంది. రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, మరీ ఇంత దారుణమా.?

నవ్విపోదురుగాక మనకేటి.? అనుకుంటే కుదరదిక్కడ.! ఇది ప్రజాస్వామ్యం. ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జవాబుదారీగా వుండాలి ముఖ్యమంత్రి. బహిరంగ సభల కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నారో ఏమో.! అక్కడ హంగామా చూస్తే.. అది వేరే లెవల్ ఖర్చు.. అని అర్థమవుతోంది. పత్రికల్లో ప్రకటనల ఖర్చు వేరే.!

మత్స్యకార భరోసా పథకం కింద లబ్దిదారులకు డబ్బులు విడుదల చేసే కార్యక్రమం అది.! ఏ కార్యక్రమం అయితేముంది.? పరమ రొటీన్ సోది.. అన్న విమర్శలు.. వాటికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, టీడీపీ అలాగే జనసేన సంబరాలు చేసుకున్నాయట. అక్కడ ఓడిన బీజేపీతో, ఇక్కడ టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయట. అలాగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. కర్నాటక రాజకీయాలకీ, మత్స్యకార భరోసాకీ సంబంధం ఏమన్నా వుందా.?

ఎందుకింతలా వణకడం.? ఎందుకింతలా భయపడే పరిస్థితిని కొనితెచ్చుకోవడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు తలవడానికే భయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనే విమర్శలు జనసేన నుంచి ఎందుకొస్తున్నాయ్.?

చంద్రబాబు పేరైతే బాగానే నోరు తిరుగుతోంది.! పవన్ కళ్యాణ్ పేరే కష్టంగా వుంది.! లేకపోతే ఏంటి.? చంద్రబాబు మీద మమకారం తగ్గడంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.! సింగిల్ సింహం కదా.? ఎవరో ఎవరితోనో పెత్తు పెట్టుకుంటే ఎందుకు భయం.?