రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.
పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ లేఖ రాశారు. ఇవ్వాళ్టి మహానాడు కీలకమైనదని, పెద్ద ఎత్తున తరలి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్ధాంతంతో ఆయన ఈ పార్టీని నెలకొల్పారని, ఆయన ఆశయాలను మరోసారి గుర్తు చేసుకుందామని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తామంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనాన్నే చూశారని, తనలోని రెండో కోణాన్ని చూస్తారంటూ గర్జించారాయన. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూసినవారు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని సహించబోనని, వారిని అణగదొక్కుతానని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే- ఇప్పటివరకూ ఎవరూ చూడనటువంటి సమర్థవంతమైన పరిపాలను అందిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పారు. తనకు మరోసారి అధికారం ఇస్తే సంపదను సృష్టిస్తానని, దాన్ని పేదలకు పంచిపెడతానని అన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను స్వీకరిస్తానని, చెప్పింది వింటానని స్పష్టం చేశారు.
మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అనేక గ్రామాలు, పట్టణాలకు మంచినీరు అందని పరిస్థితి ఉందని, దీన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులను చేయడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. దీనికోసం పూర్ టు రిచ్ అనే పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పేదవాడు అనేవాడే లేకుండా చేస్తానని, ఇందులో రాజీపడబోనని అన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని వివరించారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీసీలకు ఏరకంగా కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకొస్తానని అన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక, రాజకీయ, సామాజికపరంగా బీసీలందరికీ రక్షణ కల్పిస్తామంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.