AP

అమ్మ ఒడి నిధులపై తాజా అప్‌డేట్

పార్వతిపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోఅధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- అమ్మ ఒడి.

తమ పిల్లలను పాఠశాలు, కళాశాలల్లో చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించడానికి రూపొందించిన పథకం ఇది. దీనికింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తోంది.

ఇప్పటివరకు మూడు విడతల్లో ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికోసం బుధవారం పార్వతిపురం మన్యం జిల్లాలోని కురుపాంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సభలో పాల్గొననున్నారు. బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ సభలో పాల్గొనడానికి వైఎస్ జగన్ బుధవారం ఉదయం కురుపాం బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కురుపాం బయలుదేరి వెళ్తారు. 10 గంటలకు చినమేరంగి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభ వేదిక వద్దకు వెళ్తారు. అక్కడ ప్రజల మధ్యే అమ్మఒడి నిధులను విడుదల చేస్తారు.

ఈ సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, కురుపాం శాసన సభ్యురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.. తదితరులు ఇప్పటికే జగన్ సభ కార్యక్రమాల గురించి పర్యవేక్షించారు. సభా వేదికను పరిశీలించారు. ఈ సభకు రెండు లక్షల మంది వరకు ప్రజలు హాజరయ్య అవకాశాలు ఉన్నాయి.