NationalTechnology

ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !

బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు.

బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు.

రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లలో కొన్ని ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారుల దాడిపై కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామరాజన్ మాట్లాడుతూ నిషేధిత సంస్థ పీఎఫ్‌ఐలో పాల్గొన్న కార్యకర్తలను విచారించామని అన్నారు. సోమవారపేటలో కొందరిని విచారిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ పునాదిని కదిలించిన కార్యకర్తలు : 2022 జులై 26వ తేదీన దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలూకాలోని బెల్లారే గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా మారారు. ప్రవీణ్ హత్యకు నిరసనగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో అందోళనలు జరిగాయి.

ప్రవీణ్ హత్యతో అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ ఘటన అనంతరం కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, దక్షిణ కన్నడ జిల్లా ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సుళ్య తాలూకా ఎమ్మెల్యే అయిన అంగార కూడా అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు.