AP

స్పీకర్ తమ్మినేనిని బిగ్ షాట్ తో చెక్ చెబుతున్న జగన్

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను జగన్ పక్కన పెడతారా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ డౌటేనా? తెరపైకి కొత్త ముఖం రానుందా?

అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే వర్గ పోరును ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో మరో రెండు వర్గాలు తమ్మినేనిని బాహటంగానే వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆయనను పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది.

జగన్ వై నాట్ 175 అంటున్నారు. అందుకే ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కానీ ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం ఎదురీదుతున్నారని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఆయనను పక్కన పెట్టడం అనివార్యంగా మారింది. తమ్మినేని మాత్రం తన కుమారుడు కి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇక్కడే హై కమాండ్ తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. తెరపైకి బొడ్డేపల్లి కుటుంబీకులను తీసుకొస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శాసించారు. కాళింగ సామాజిక వర్గం ఆయనను ఒక దైవంగా భావిస్తుంది. అందుకే ఇటీవల ఆయన శత జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అయితే దీని వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బొడ్డేపల్లి కుటుంబం నుంచి ఒకరిని పోటీకి నిలపాలని వైసీపీ భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అయితే సరైన అభ్యర్థి అవుతారని.. వైసీపీలోని మిగతా వర్గాల సైతం సహకరించే ఛాన్స్ ఉందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 2004,2009 ఎన్నికల్లో సత్యవతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో ఆమెకు మంచి పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను వైసీపీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తమ్మినేని సీతారాంకు టికెట్ లేనట్టే.

బొడ్డేపల్లి కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకురావడం ద్వారా శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని గెలుపొందాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. గత రెండు ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానాన్ని టిడిపి గెలుపొందింది. మరోసారి రామ్మోహన్ నాయుడు గెలుస్తారని టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో కుల రాజకీయాలకు తెరలేపాలని వైసీపీ భావిస్తోంది. దివంగత బొడ్డేపల్లి రాజగోపాల్ రావు లెగసీని ఉపయోగించుకుంటే కాళింగ సామాజిక వర్గం వైసీపీ గూటికి చేరుతుందని అధినాయకత్వం భావిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎమ్మెల్యేగా తప్పించి ఎంపీగా పోటీ చేయించాలని వ్యూహరచన చేస్తోంది. ఆమదాలవలస ఎమ్మెల్యేగా బొడ్డేపల్లి సత్యవతి, ఎంపీగా తమ్మినేని సీతారాం పోటీ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే దీనికి తమ్మినేని సీతారాం ఒప్పుకుంటారో లేదో చూడాలి మరి.