ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు కి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సబబు కాదని, చంద్రబాబు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి వ్యాఖ్యలు చేయడం పురందేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేసేలా చేస్తుంది.
చంద్రబాబుకు దగ్గుబాటి పురందరేశ్వరి మద్దతు పలుకుతున్నారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురందరేశ్వరి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆమె చేస్తున్న వ్యాఖ్యల పైన, ఆమె పని తీరు పైన ఏదో ఒక రకంగా వైసిపి రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కు ఆమె మద్దతుగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
పురందేశ్వరి అవినీతిపరులకు మద్దతు పలుకుతున్నారని వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగితే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు గారు అధ్యక్షుడిగా కొనసాగితే పురందరేశ్వరి లా అవినీతిపరులకు మద్దతు పలికే వారు కాదని, తెలుగుదేశం పార్టీ బలహీనతను వీర్రాజు గారు తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునే వారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన ప్రస్తుత బలహీన పరిస్థితులను, బిజెపిని బలోపేతం చేయడానికి సోము వీర్రాజు ఉపయోగించుకునే వారిని విజయ సాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు అధ్యక్షుడిగా కొనసాగితే ‘బావ’సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు అని పేర్కొన్న ఆయన చంద్రబాబు పురందరేశ్వరికి బావ కావడంతోనే బావకు మద్దతుగా మరదలు మాట్లాడుతున్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు గారు కర్ణాటక డిప్యూటి సిఎం డీకే శివకుమార్ గారి ద్వారా ‘ఇండియా’ కూటమికి దగ్గరవుతున్న విషయం బిజెపి అధిష్ఠానానికి తెలుసు అని పేర్కొన్న ఆయన, అయినప్పటికీ పురందరేశ్వరి చంద్రబాబు అరెస్టుపై అక్రమ అరెస్ట్ అని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.