AP

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు తీస్తున్నాయి. అయితే ఇందులో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

సామాన్యులకు అందుబాటులో లేదని, అటువంటప్పుడు ఎన్నిపేర్లు పెట్టి.. ఎన్నిసార్లు తిప్పినా ఉపయోగం ఏమిటంటూ రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆలోచనలో పడిన భారతీయ రైల్వే సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో రైళ్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది.

చెన్నైలో తయారీ : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతున్నాయి. మొత్తం ఒక్కో రైలుకు 24 ఎల్ హెచ్ బీ కోచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. బయో వాక్యూమ్ టాయ్ లెట్స్ తోపాటు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఛార్జింగ్ పాయింట్స్ వంటి అధునాతన ఫీచర్లను అమరుస్తున్నారు. రైలు మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ సిస్టం సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

శతాబ్ది, జనశతాబ్దిలా : వందే సాధారణ్ రైళ్లకు స్టాపేజ్ లు తక్కువగా నిర్ణయిస్తున్నారు. మెయిల్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. శతాబ్ది, జన శతాబ్ది రైళ్లు ఎలా ఉన్నాయో.. అలాగే వందే భారత్, వందే సాధారణ్ రైళ్లు ఉంటాయని వీటిమధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. శతాబ్ది రైళ్ల ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు రావడంతో సాధారణ ఛార్జీలతో జనశతాబ్ధి రైళ్లను ప్రవేశపెట్టామని, అలాగే వందే సాధారణ్ రైళ్లు కూడా అని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వందే సాధారణ్ రైలు ఛార్జీలపై అధికారికంగా నిర్ణయం వెలువడకపోయినప్పటికీ వందే భారత్ రైళ్ల కంటే తక్కువగా, ప్రస్తుతం ఉన్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో సమానంగా ఉంటాయంటున్నారు.