AP

సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ.. బెదిరేది లేదంటున్న వైసీపీ….

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురుందేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేస్తోంది. పురందేశ్వరి టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా అని జగన్ శిబిరం ప్రశ్నిస్తోంది. అయితే.. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పురందేశ్వరి లేఖ రాశారు. దీంతో పురందేశ్వరి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ మరింత వేడెక్కింది.

 

పదేళ్లుగా విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఆమె వివరించారు. పదవులను అడ్డం పెట్టుకొని జనాలను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో మద్యం, ఇసుక, భూముల, మైనింగ్‌లో భారీ దోపీడిలు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిపై నమోదైన కేసుల వివరాలను జత చేస్తూ.. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు.

 

పురందేశ్వరి లేఖకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలుకుతున్న టీడీపీకి.. పురందేశ్వరి ఏపీలో మద్దతిస్తున్నారని ఆయన రాసుకొచ్చారు. పురందేశ్వరి చేస్తున్న ఈ రాజకీయం ఏంటని ఆయన ప్రశ్నించారు. కుటుంబ రాజకీయమా?. కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?. లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? అంటూ ట్వీట్ చేశారు.

 

మరోవైపు ఈ వార్‌లోకి టీడీపీ నేతలు ఎంటరయ్యారు. పురందేశ్వరికి మద్దతుగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.