AP

రాజీనామాల వేళ.. జగన్ మెరుపు నిర్ణయం: సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్: కొత్త ఇన్‌ఛార్జీ నియామకం..

గ్రేటర్ విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి (Tippala Devan Reddy) రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తోన్నట్లు తెలిపారు.

 

సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కల్యాణ్‌నే మట్టి కరిపించిన పేరును సాధించారు నాగిరెడ్డి. భారీ మెజారిటీతో పవన్‌ను ఓడించి, జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన కుమారుడు దేవన్ రెడ్డిని కోఆర్డినేటర్‌గా అపాయింట్ చేసింది వైసీపీ.

 

Gudivada Amarnath appointed as incharge of Gajuwaka assembly

ఇప్పుడాయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం టికెట్‌ను యాదవ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తనకు గానీ, తన తండ్రికి గానీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

 

ఈ పరిణామాల మధ్య- వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటికప్పుడు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జీని ప్రకటించారు. మంత్రి గుడివాడ్ అమర్‌నాథ్‌ను గాజువాక పార్టీ కోఆర్డినేటర్‌గా నియమించారు.

 

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సొంత నియోజకవర్గం విశాఖ పొరుగునే ఉన్న అనకాపల్లి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణను 8,000లకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అనంతరం జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్నారు.

 

విశాఖపట్నం జిల్లా రాజకీయాలపై గుడివాడ అమర్‌నాథ్‌కు మంచి పట్టు ఉంది. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల గాజువాకలో ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసినట్టే. దీన్ని బట్టి చూస్తే తిప్పల నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తోంది