AP

పవన్ ఆ ఒక్క హామీతో ఉద్యోగ, ఉపాధ్యాయులు యూటర్న్..

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సిపిఎస్ రద్దు ఒకటి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేయిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతగానో నమ్మారు. జగన్ ను తన సొంత వాడిలా భావించారు. తాము మద్దతు తెలపడమే కాకుండా.. ఇతరులపై ప్రభావం చూపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం దాటింది.. రెండు వారాలు దాటాయి.. వందల వారాలు దాటిపోయాయి. కానీ సిపిఎస్ మాత్రం రద్దు కాలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. పైగా అడుగడుగునా వారికి అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ఎన్నికలకు ముందు సొంత కుటుంబంలో భావించిన వారే.. ఇప్పుడు వైసీపీకి ప్రత్యర్ధులుగా మారారు. శత్రువులుగా చూస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని పవన్ స్పష్టమైన ప్రకటన చేయడం విశేషం.

 

More

From Ap politics

లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. విజయోత్సవ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. సభకు పవన్ హాజరయ్యారు. తన ప్రసంగంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిపిఎస్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఒక రకమైన చలనం వచ్చింది. కొత్త ఆశలు రేగాయి. నిన్నటి నుంచి ఏ ఇద్దరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలిసిన ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. గతంలో సిపిఎస్ రద్దు కోసం విజయవాడలో నిర్వహించిన మిలీనియం మార్చ్ కు పవన్ స్పష్టమైన మద్దతు ప్రకటించారు. నాటి నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశం చేర్చుతామని చెబుతుండడం విశేషం.

 

సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ కు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు అవసరం. అప్పు చేసేందుకు రుణపరిమితి కీలకం. అది చేయాలంటే విద్యాసంస్థల్లో భాగంగా సిపిఎస్ రద్దు లాంటివి చేయకూడదని కేంద్రం ఒత్తిడి ఉంది. ఒకవేళ సిపిఎస్ రద్దు చేసినా ఆర్థిక భారం పడుతుంది. అదే జరిగితే సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. దీంతో నాలుగున్నర సంవత్సరాలుగా కాలయాపన చేశారు. ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు తిరిగారు. వారిని దారిలోకి తెచ్చుకోవడం అంత సులువయ్యే పని కాదు. ఈ పరిస్థితుల్లో పవన్ సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ రెండు వర్గాలు.. టిడిపి, జనసేన కూటమి వైపు వెళ్లే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చినట్టే.. ఈసారి కూటమి ప్రభుత్వం రావాలని బలంగా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.