AP

వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ..

గత కొంతకాలంగా వైసీపీ హై కమాండ్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంశీ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయ్యింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ జగన్ మొండి చేయి చూపారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ గా అవకాశం ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేటర్ గా పోటీ చేసిన వంశీకృష్ణ మేయర్ పదవిని ఆశించారు. కానీ అప్పుడు కూడా జగన్ హ్యాండ్ ఇచ్చారు. సామాజిక సమీకరణలను తెరపైకి తెచ్చి హరి కుమారికి అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తి తో వంశీకృష్ణ రగిలిపోయారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో శాంతించారు.

 

వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వంశీకృష్ణ శ్రీనివాస్ భావించారు. కానీ అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ను తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమించారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతోందని ఆవేదనతో గడుపుతూ వచ్చారు. ఈ తరుణంలో పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి.. నేరుగా జనసేనలో చేరారు. జనసేన టికెట్ పై వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో కీలక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ బరిలో దిగుతారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పట్ల ఆకర్షితుడై తాను ఈ పార్టీలో చేరినట్లు వంశీ వెల్లడించారు. వైసీపీలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. విసిగి వేసారి పోయే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చానని.. చాలామంది బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.