AP

చంద్రబాబు ఇంటికి షర్మిల- దశాబ్దాల వైరంలో బిగ్ టర్న్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్ధులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్, చంద్రబాబు ఎపిసోడ్ కు హెలికాఫ్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, బయటా చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్, చంద్రబాబు స్ధాయి పోరు అధికార, విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.

 

అలా గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటూ, గతంలో తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవబోతున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించబోతున్నారు. ఈ ఆసక్తికర ఘట్టానికి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వేదిక కాబోతోంది. మరికాసేపట్లో వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ను ఆహ్వానించబోతున్నారు.

 

అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణలో వైఎస్సార్టీపీ స్ధాపించిన తర్వాత వైఎస్ షర్మిలపై సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్న టీడీపీ, చంద్రబాబు, లోకేష్ విషయంలో ఇప్పుడు ఆమెకు కూడా అదే భావన ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్ కు వైఎస్ షర్మిల పంపిన గిఫ్ట్, గ్రీటింగ్స్.. వాటికి లోకేష్ చెప్పిన థ్యాంక్స్ చర్చనీయాంశమయ్యాయి. అసలే ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్న షర్మిల ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని ఆహ్వానిస్తే రాజకీయాల సంగతి ఏమో కానీ వైఎస్, నారా కుటుంబాల మధ్య గతంలో సాగిన వార్ కు కొంతమేర తెరపడినట్లే భావించవచ్చు.