AP

పాపం.. షర్మిల మాటలు వింటే జాలేస్తోంది; లోకేష్ ట్వీట్ పైనా.. మంత్రి బొత్సా కౌంటర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మార్చారు. వైయస్ కుటుంబంలో చీలిక తెచ్చింది జగన్ అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

రాష్ట్రం అభివృద్ధి లేక దయనీయస్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని షర్మిల నిప్పులు చెరిగారు. ఇక తాజాగా షర్మిల మరోమారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడడంతో వైసిపి మంత్రులు, ముఖ్య నాయకులు ఆమెపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందన్నారు. టిడిపి నేత చంద్రబాబు మాట్లాడిన మాటలని వైయస్ షర్మిల మాట్లాడుతున్నారని బొత్స పేర్కొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాదన్నది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ చంద్రబాబును వదిలిపెట్టి తమ పార్టీని వైయస్ షర్మిల టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. ఇక వైయస్ షర్మిల పదేపదే సీఎం జగన్ బిజెపికి అమ్ముడుపోయారని చేస్తున్న వ్యాఖ్యల పైన బొత్స సత్యనారాయణ స్పందించారు.

 

అంశాల వారిగానే తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని పేర్కొన్న బొత్స సత్యనారాయణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డినే ప్రధాని మోడీని కలిశారని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రరాష్ట్రాలు కోఆర్డినేషన్ తో పనిచేయాలని బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము బిజెపితో కలిసి పనిచేయడం లేదని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తాము మూడు రాజధానులు అంటే, బిజెపి రాజధాని అమరావతి అంటుందని గుర్తు చేశారు.

 

ప్రతిపక్షాలకు అధికారం కావాలని, మాకు మాత్రం సంక్షేమం కావాలని పేర్కొన్నారు. ప్రజలు ఏది మర్చిపోరు అని పేర్కొన్న బొత్స సత్యనారాయణ మరికొద్ది రోజుల్లో ప్రజలు సమాధానం చెబుతారన్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా రాజీనామా ఇచ్చారని, స్పీకర్ ఫార్మెట్లో లెటర్ రాసి స్పీకర్ ను కలిసి రాజీనామా చేశారని పేర్కొన్నారు.

 

ఇక ఆయన రాజీనామా అంశాన్ని కూడా తమపై ఆపాదిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. ఇక లోకేష్ తాజాగా చేసిన ట్వీట్ పైన కూడా మండిపడిన మంత్రి బొత్స లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని, 70 రోజులలో ఎవరి మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు.