AP

పవన్ ఎఫెక్ట్, టీడీపీలో సీట్ల రచ్చ – అచ్చెన్న నిలదీత, అల్టిమేటం..!!

టీడీపీ, జనసేన పొత్తులో రచ్చ మొదలైంది. సీట్ల పంచాయితీలు రోడ్డెక్కాయి. టీడీపీ మిత్రధర్మం పాటించకుండా సీట్లు ప్రకటించటం పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ చేసిన ప్రకటనకు ప్రతిగా తాను రెండు సీట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు సీట్లలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీసారు. టికెట్ల పైన తేల్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు.

 

పొత్తుల చిక్కులు : ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనా ఇప్పటికీ సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలలేదు. ఇప్పుడే సీట్ల గురించి రెండు పార్టీల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మండపేట, అరకు సీట్లకు తమ అభ్యర్దులను ప్రకటించారు. దీనిని తప్పు బట్టిన పవన్ ఇలా జరిగినందుకు తన పార్టీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. టీడీపీ చేసిన ప్రకటనకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తాను రెండు సీట్లు ప్రకటిస్తున్నాంటూ రాజోలు, రాజానగరం సీట్లను ఖరారు చేసారు. దీంతో, ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, సీట్లు ఆశిస్తున్న నేతలకు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సమావేశమయ్యారు. రాజోలు సీటు జనసేకు ఇవ్వటం పైన ఆందోళనకు దిగారు.

 

టీడీపీ నేతల ఆందోళన : రాజోలు నుంచి సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి సీట్లు ఆశిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఆ రెండు సీట్ల నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా..కనీసం తమను సంప్రదించకుండా ఇలా ప్రకటన చేయటం పైన సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులతో సమావేశమయ్యారు. చంద్రబాబు జిల్లాల పర్యటన లో ఉండటంతో అచ్చెన్నాయుడుతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అచ్చెన్నా వారిని సముదాయించారు. పొత్తులో భాగంగా జనసేన ఆ సీట్లను ప్రకటించిందని..చంద్రబాబు అన్ని విషయాలు మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని బుజ్జగించే ప్రయత్నం చేసారు. కానీ, గొల్లపల్లి అనుచరులు తమకు న్యాయం చేయాలని నినదించారు.

కొనసాగుతున్న రచ్చ : ఇదే తరహాలో పిఠాపురంలోనూ టీడీపీ – జనసేన నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. స్థానిక సామాజిక సమీకరణాలతో జనసేన ఇక్కడ సీటు పైన ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఈ సమయంలోనే వర్మ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీటికి జనసేన నేతలను ఆహ్వానించలేదు. ఇదే సమయంలో వర్మకు మద్దతుగా సభకు హాజరైన అయ్యన్న పాత్రుడు పిలవగానే అందుబాటులో ఉండే వర్మ లాంటి నేతలు అవసరమంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రెండు పార్టీల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ మొదలైంది.